Yash: యష్ సినిమా ఎఫ్ఐఆర్ పై స్టే విధించిన హైకోర్టు.. అసలేం జరిగిందంటే..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కేజీఎఫ్ సినిమాతో క్రేజ్ సొంతం చేసుకున్నాడు హీరో యశ్. ఈ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. దీంతో ప్రస్తుతం అతడి కొత్త సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తోన్న ‘టాక్సిక్’ నిర్మాతలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు స్టే విధించింది. దీంతో చిత్ర నిర్మాతలు కెవిఎన్ ప్రొడక్షన్స్, యష్ లు రిలీవ్ అయ్యారు. ‘టాక్సిక్’ చిత్ర బృందం అటవీ చట్టాన్ని ఉల్లంఘించిందని ఆరోపిస్తూ చిత్ర నిర్మాణ సంస్థలు కెవిఎన్, మాన్స్టర్ మైండ్స్‌పై రాష్ట్ర అటవీ శాఖ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫిర్యాదు ఆధారంగా ఎఫ్‌ఐఆర్ కూడా నమోదైంది. ఇప్పుడు ఈ ఎఫ్‌ఐఆర్‌పై హైకోర్టు స్టే విధించింది. అసలు విషయానికి వస్తే… బెంగళూరు శివార్లలోని హెచ్‌ఎంటీ మైదానంలో ‘టాక్సిక్’ సినిమా సెట్‌ను నిర్మించారు. భారీ మొత్తంలో ఖర్చు చేసి ఇక్కడ సెట్‌ను నిర్మించారు. అయితే సెట్‌ను నిర్మించేందుకు ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే మైదానంలో ఉన్న చెట్లను అక్రమంగా నరికివేశారని అటవీశాఖ ఆరోపిస్తూ దీనిపై ఓ న్యాయవాది కోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్‌ను కూడా దాఖలు చేశారు. అటవీ శాఖ మంత్రి ఈశ్వర ఖండ్రే స్వయంగా ‘టాక్సిక్’ సినిమా సెట్‌ను సందర్శించి పరిశీలించారు. అటవీ శాఖ శాటిలైట్ చిత్రాలను విడుదల చేసి ‘టాక్సిక్’ సినిమా సెట్ వేసే ముందు ఆ ప్రాంతం ఎలా ఉందో, సెట్ నిర్మించిన తర్వాత ఎలా ఉందో మీడియాకు చూపించారు. కానీ చిత్రబృందం మాత్రం తాము చెట్లను నరికేయలేదని, పొలంలో ఉన్న గుంతలను శుభ్రం చేశామని తెలిపింది. ఈ కేసులో హెచ్‌ఎంటీ సంస్థపై కూడా ఆరోపణలు వచ్చాయి. సినిమా షూటింగ్‌ల కోసం ప్రభుత్వం ఇచ్చిన భూమిని హెచ్‌ఎంటీ అక్రమంగా సొమ్ము చేసుకుంటుందని ఆరోపించారు. దీనిపై క్లారిటీ విడుదల చేసిన హెచ్‌ఎంటీ.. ‘టాక్సిక్‌’ సినిమా సెట్స్‌పై పెట్టిన ప్రదేశానికి తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. ఆ స్థలం ఇప్పుడు కెనరా బ్యాంక్ సుపర్ధి వ్యవహారంలో ఉందని తెలిపింది. తాజాగా కర్ణాటక రాష్ట్ర హైకోర్ట్ న్యాయమూర్తి నాగప్రసన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యాజ్యాన్ని విచారించి, చిత్ర నిర్మాతలపై దాఖలైన ఎఫ్‌ఐఆర్‌పై మధ్యంతర స్టే విధించింది. 400 ఎకరాల భూమిలో 18 ఎకరాలను హెచ్‌ఎంటీ కెనరా బ్యాంకుకు విక్రయించిందని ‘టాక్సిక్’ చిత్ర నిర్మాతల తరపున వాదించిన అడ్వకేట్ బిపిన్ హెగ్డే తెలిపారు. ఇక్కడ 30 కోట్లు పెట్టుబడి పెట్టి సినిమా సెట్ వేశారు. సెట్ నిర్మించిన భూమి అటవీ భూమి కాదని ప్రభుత్వమే కోర్టుకు తెలిపింది. షూటింగ్ సెట్ వేయడానికి చెట్లను కూడా నరకలేదని వాదించారు. వాదనలు విన్న న్యాయమూర్తులు మధ్యంతర స్టే ఉత్తర్వులు జారీ చేశారు.