Telangana: నలంద జూనియర్ కాలేజీ పైత్యం.. నిండు ప్రాణాలు తీసుకున్న ఇంటర్ విద్యార్ధి! ఏం జరిగిందంటే..
ర్యాంకుల కోసం ప్రైవేట్ కాలేజీల ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. నానాటికీ రెచ్చిపోతున్నాయి. తాజాగా స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట నలందా జూనియర్ కాలేజీ పెడుతున్న హింసను తట్టుకోలేక ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ విద్యార్ధి ఆదివారం ఇంట్లో ఉరి పెట్టుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన కొత్తగూడెంలో చోటు చేసుకుంది.. కొత్తగూడెం, జనవరి 6: చదువుల ఒత్తిడికి మరో విద్యార్ధి బలైంది. స్పెషల్ క్లాసులు, ర్యాంకుల పేరిట కాలేజీ యాజమాన్యం వేధింపులను తాళలేక ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్న ఘటన భద్రాద్రి జిల్లాలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. భద్రాద్రి జిల్లా చుంచుపల్లి మండలం విద్యానగర్‌కు చెందిన శనగ లక్ష్మణ్ కుమారుడు రాంపవర్ (18) స్థానికంగా ఉన్న లక్ష్మీదేవిపల్లిలోని శ్రీ నలంద జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. త్వరలో పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో కాలేజీ యాజమన్యం బాగా చదివే విద్యార్ధులను సపరేట్ బ్యాచ్ చేసి, ఉదయం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు స్పెషల్ క్లాసులు పెట్టి చదివిస్తుంది. ఈ నేపథ్యంలో రాంపవర్ విద్యానగర్ కాలనీలోని నానమ్మ ఇంటి వద్ద ఉంటూ కాలేజీకి వెళ్తున్నాడు. అయితే గత వారంరోజులుగా రాంపవర్ కాలేజీకి వెళ్లకుండా ఇంటి వద్దనే చదువుకుంటున్నాడు. అయితే కాలేజీ యాజమన్యం విద్యార్థికి, అతడి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కాలేజీకి రావాలని, లేకుంటే హాల్ టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. దీంతో ఒత్తిడికి గురైన రాంపవర్ ఆదివారం ఉదయం తెల్లవారు జామున 4 గంటల సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చుంచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే రాంపవర్ కాలేజీకి వెళ్లకపోవడంతో కాలేజీ యాజమన్యం అతడిని మందలించింది. దీంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్‌ఐ రవికుమార్ తెలిపారు. కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాతు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరో 2 నెలల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలు ఉండగా.. గడిచిన 12 రోజుల్లో సదరు విద్యార్థి ఒక్క రోజు మాత్రమే కళాశాలకు వచ్చాడని, తామేమీ ఆ విద్యార్థిని వేధించడం లేదని కొత్తగూడెం నలంద కాలేజీ సీఈవో చైతన్య కథలు చెబుతున్నాడు. కేసు దర్యాప్తులో ఉందని, విచారణ అనంతరం పూర్తి వివరాలు వెళ్లడిస్తామని పోలీసులు తెలిపారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827