Sheikh Hasina: షేక్‌ హసీనాను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేఖలో ఏముంది..?

Sheikh Hasina: షేక్‌ హసీనాను భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేఖలో ఏముంది..? బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని షేక్‌ హసీనాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు అక్కడి ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈసారి దౌత్య పరంగా భారత్‌ను సంప్రదించింది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న మాజీ ప్రధాని షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లాదేశ్‌ ప్రభుత్వం మరోసారి భారత్‌కు లేఖ రాసింది. న్యాయ ప్రక్రియలో భాగంగా విచారించేందుకు ఆమెను అప్పగించాలని కోరింది. భారత్‌కు దౌత్యపరమైన నోట్ పంపినట్టు విదేశీ వ్యవహారాల సలహాదారుడు తౌహిద్‌ హొస్సేన్‌ పేర్కొన్నారు. మరోవైపు బంగ్లా హోంశాఖ కూడా హసీనాను రప్పించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం అవసరమైన చర్యలు చేపట్టాలని విదేశాంగ శాఖకు లేఖ రాశామని, ఆ ప్రక్రియ కొనసాగుతోందని హోంశాఖ సలహాదారు జహంగీర్‌ ఆలమ్‌ వెల్లడించారు. వ్యక్తుల అప్పగింతకు సంబంధించి భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఒప్పందం ఉందని, దీని ప్రకారం హసీనాను స్వదేశానికి తిరిగి తీసుకురావచ్చని వెల్లడించారు. షేక్‌ హసీనాపై ఇంటర్నేషనల్ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ అరెస్టు వారెంట్ జారీ అయింది. హసీనాతో పాటు ఆమె హయాంలో ఎంపీలకు జారీ చేసిన దౌత్య పాస్‌పోర్టులను ఇదివరకే రద్దు చేసింది బంగ్లాదేశ్‌ హోం మంత్రిత్వ శాఖ. ఈ ఏడాది జులై 15 నుంచి ఆగస్టు 5 వరకు బంగ్లాదేశ్‌లో జరిగిన మారణహోమం, హత్యలు, ఇతర నేరాల ఆరోపణలపై షేక్‌ హసీనా సహా ఆమె పార్టీ అవామీ లీగ్‌కు చెందిన అగ్ర నాయకులు 45 మందిపై ఇప్పటికే అరెస్టు వారెంట్‌ జారీ అయింది. తమ ఎదుట హాజరుపరచాలని ఆ దేశ ఇంటర్నేషనల్‌ క్రైమ్స్‌ ట్రైబ్యునల్‌ ఇప్పటికే ఆదేశించింది. రిజర్వేషన్ల వ్యతిరేక ఆందోళనలతో హసీనా తన పదవికి రాజీనామా చేసి ఈ ఏడాది ఆగస్టు 5న బంగ్లాదేశ్‌ను వీడి భారత్‌కు వచ్చారు. అప్పటి నుంచి భారత్‌లోనే ఆమె ఆశ్రయం పొందుతున్నారు. హసీనా భారత్‌లో ఉండడాన్ని ధృవీకరిస్తూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఆగస్టులో పార్లమెంటులో ఒక ప్రకటన చేశారు. సెప్టెంబరులో, జర్మనీలోని బెర్లిన్‌కు అధికారిక పర్యటనలో ఉన్నప్పుడు, విదేశీ వ్యవహారాల మంత్రి, భారత ప్రభుత్వం దౌత్యపరంగా అప్పగింత సమస్యను డిప్లమాటిక్‌గా వ్యవహరిస్తుందని తెలిపారు. అయితే భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న దౌత్య ఒప్పందం ప్రకారం షేక్‌ హసీనాను కేంద్రం బంగ్లాదేశ్‌కు అప్పగిస్తుందా? లేదా అనేది ఆసక్తిగా మారింది.