Sabarimala: శబరిమల ఆలయంలో నటుడికి రాచ మర్యాదలు.. భక్తులను నిలిపేసి మరీ వీఐపీ దర్శనం.. హైకోర్టు ఆగ్రహం

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఎంతో విశిష్ఠత ఉంది. సెలబ్రిటీ అయినా, శ్రామికుడైనా ఇక్కడ అందరూ సమానమే. క్యూలో వచ్చి స్వామి వారిని దర్శనం చేసుకోవాల్సిందే. అలాంటిది ఆలయ నిబంధనలను పక్కన పెట్టి ఒక స్టార్ హీరోకు వీఐపీ దర్శనం కల్పించడం చర్చనీయాంశమైంది. శబరిమలలో కొలువై ఉన్న అయ్యప్ప స్వామి దర్శించుకోవడానికి భక్తులు ఎంతో నిష్ఠగా వెళతారు. సుమారు 41 రోజుల పాటు కఠిన దీక్షలు చేసి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళతారు. కోట్లకు అధిపతి అయినా, సెలబ్రిటీ అయినా, శ్రామికుడైనా ఇక్కడ అందరూ సమానమే. క్యూ లైన్ లో వచ్చి స్వామి వారిని దర్శించుకోవాల్సిందే. అయితే మలయాళంలో ప్రముఖ నటుడిగా గుర్తింపు ఉన్న దిలీప్‌ కు అయ్యప్ప స్వామి ఆలయంలో వీఐపీ దర్శనం కల్పించిందిట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు. దీనిని కేరళ హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. డిసెంబర్‌ 4న నటుడు దిలీప్‌ శబరిమలలోని అయ్యప్ప క్షేత్రాన్ని దర్శించుకున్నారు. ఈ సమయంలో టీడీబీ అధికారులు ఆయనకు వీఐపీ దర్శనం కల్పించారు. ఈ కారణంగా సాధారణ భక్తులు గంటల తరబడి క్యూ‌లో వేచి ఉండాల్సి వచ్చింది. దిలీప్‌కు వీఐపీ దర్శనం కల్పించడం వల్ల సాధారణ భక్తులు బాగా ఇబ్బంది పడ్డారని, కొందరైతే దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారంటూ కథనాలు వచ్చాయి. దీనికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలయ్యాయి. దీంతో ఈ కేసును హైకోర్టు సుమోటోగా తీసుకుని విచారించింది. నటుడు దిలీప్‌ను ఆలయంలో దర్శనానికి ఎలా అనుమతిచ్చారని కేరళ కోర్టు టీడీబీ అధికారులను ప్రశ్నించింది. ఈ నిర్ణయం వల్ల వృద్ధులు, చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ట్రావెన్‌కోర్‌ దేవస్థానం బోర్డు అధికారులే ఇలాంటి తప్పులు చేస్తే.. సాధారణ భక్తుల తమ సమస్యలను ఎవరితో చెప్పుకుంటారని ప్రశ్నించింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారికి మాత్రమే శబరిమల ఆలయంలో వీఐపీ దర్శనం ఉంటుందని టీడీబీ అధికారులకు తెలియదా? అని కోర్టు గుర్తుచేసింది. ఈ ఘటనపై విచారణ చేపట్టి వెంటనే వివరాలను కోర్టుకు సమర్పించాలని పోలీసులను ఆదేశించింది.