PM Modi: నమో భారత్ కారిడార్‌కు ప్రధాని మోదీ శ్రీకారం.. ఢిల్లీ – మీరట్ మధ్య పెరిగిన కనెక్టివిటీ..!

సాహిబాబాద్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ నుండి న్యూ అశోక్ నగర్ ఆర్‌ఆర్‌టిఎస్ స్టేషన్ వరకు నమో భారత్ రైలులో కూడా ప్రధాని ప్రయాణించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో ఢిల్లీ-మీరట్ మధ్య ప్రయాణ ప్రక్రియ మరింత సులభతరం కానుంది. ఇది ప్రయాణ సమయాన్ని తగ్గించడమే కాకుండా భద్రత, విశ్వసనీయత, అధిక వేగం, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందిస్తుంది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం (జనవరి 5) ఉదయం ఢిల్లీ-మీరట్ నమో భారత్ కారిడార్‌కు శ్రీకారం చుట్టారు. సాహిబాబాద్ – న్యూ అశోక్ నగర్ మధ్య 13 కిలోమీటర్ల పొడవైన అదనపు విభాగాన్ని ప్రారంభించారు. ఉదయం హిండన్ ఎయిర్‌బేస్ నుంచి సాహిబాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ అదనపు మెట్రో లైన్‌ను జాతికి అంకితం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఢిల్లీలోని మెట్రో నమో భారత్ కారిడార్‌ను ప్రారంభించారు. సాహిబాబాద్ RRTS స్టేషన్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు నమో భారత్ రైలులో ప్రయణించారు. రాపిడ్ రైల్‌లో చిన్నారులతో ముచ్చటించారు. అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సాహిబాబాద్ నుంచి న్యూ అశోక్ నగర్ వరకు ఉన్న 13 కిలోమీటర్ల కారిడార్ లో ప్రధాన స్టేషన్ ఆనంద్ విహార్‌తో సహా ఆరు కిలోమీటర్లు భూగర్భంలో ఉన్నాయి. అండర్ గ్రౌండ్ విభాగంలో నమో భారత్ రైళ్లు నడపడం ఇదే తొలిసారి. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లను అనుసంధానం చేసే విధంగా నమో భారత్ స్టేషన్లను రూపొందించారు. ప్రస్తుతం RRTS ఢిల్లీ-మీరట్ కారిడార్‌లో 42 కిలోమీటర్ల మేర నమో భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఢిల్లీ మెట్రోకు NCRలో 393 కిలోమీటర్ల నెట్‌వర్క్‌ ఉంది. ఢిల్లీలో రవాణా వ్యవస్థను విస్తరించేందుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు ప్రధాని మోదీ. దేశ రాజధాని అభివృద్ధితో పాటు ప్రజల సంక్షేమానికి పూర్తిగా అంకితమైన ప్రభుత్వాన్ని ఢిల్లీ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.