Nitish Kumar Reddy: ఇది తెలుగోడి బ్రాండ్ అంటే.. ఆసీస్ గడ్డపై టాలీవుడ్ హీరోలను గుర్తు చేసిన నితీశ్ రెడ్డి

ఇది సెంచరీ కాదు పుష్పా.. అంతకుమించి.. ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ ఫైర్ బ్యాటింగ్‌ పవర్‌ ఇది. హాఫ్‌ సెంచరీ తర్వాత పుష్ప స్టయిల్‌లో తగ్గేదే లేదంటూ సెలబ్రేషన్స్‌ చేసుకున్న నితీశ్‌ కుమార్‌ రెడ్డి... సెంచరీ చేశాక...సలార్‌లో ప్రభాస్‌ని ఇమిటేట్‌ చేస్తూ సెలబ్రేట్‌ చేసుకున్నాడు మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో అద్భుతమైన శతకంతో మెరిసిన నితీశ్‌ కుమార్‌ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరినీ గర్వపడేలా చేశాడు. విశాఖకు చెందిన నితీష్‌.. 21 ఏళ్ల 214 రోజుల వయసులోనే ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించాడు. తద్వారా ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించిన మూడో అత్యంత పిన్న వయస్కుడైన భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. క్రికెట్‌ దిగ్గజం​ సచిన్‌ 18 ఏళ్ల 253 రోజుల వయసులో ఆసీస్‌ గడ్డపై సెంచరీ సాధించగా.. రిషబ్‌ పంత్‌ 21 ఏళ్ల, 91 రోజుల వయసులో ఆస్ట్రేలియాలో శతకొట్టాడు. భారత క్రికెట్‌లో సరికొత్త ధృవ తార అవతరించింది. నితీశ్‌ కుమార్‌ రెడ్డి రూపంలో టీమిండియాకు మరో ఆణిముత్యం దొరికాడు. మెల్‌బోర్న్‌ టెస్ట్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన నితీశ్‌.. సహచరుడు వాషింగ్టన్‌ సుందర్‌ను సమన్వయపరుచుకుంటూ అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. బాక్సింగ్‌ డే టెస్ట్‌లో నితీశ్‌ చేసిన సెంచరీ ఆషామాషీ సెంచరీ కాదు. భారత క్రికెట్‌ అభిమానులకు ఈ సెంచరీ ఎప్పటికీ గుర్తుంటుంది. అరంగేట్రం సిరీస్‌లోనే సూపర్‌ సెంచరీతో మెరిసిన నితీశ్‌ విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానుల మన్ననలందుకుంటున్నాడు. నితీశ్‌ ఆగమనంతో భారత క్రికెట్‌ సరికొత్త ధృవ తార అవతరించిందని క్రికెట్‌ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. సునీల్‌ గవాస్కర్‌ లాంటి దిగ్గజం నితీశ్‌ సెంచరీని అద్వితీయమైనదిగా అభివర్ణించాడు. ఆసీస్‌ సిరీస్‌లో నితీశ్‌ ఆది నుంచి అద్భుతంగా ఆడుతున్నాడు. ఈ సిరీస్‌లో నితీశ్‌ బ్యాట్‌తో పాటు బంతితోనూ రాణించాడు. నితీశ్‌.. ఈ సిరీస్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ఈ సెంచరీతో నితీశ్‌ ఆసీస్‌ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. భారత్‌ తరఫున ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీ చేసిన తొలి ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు.