Mohan Babu: మీడియా పై మోహన్ బాబు దాడి.. విచారణకు రావాలని పోలీసుల నోటీసులు

మంచు మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు మోహన్ బాబు, మనోజ్, విష్ణు లైసెన్స్ తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈరోజు ఉదయం 10.30గంటలకు విచారణకు హజరు కావాలని ఆదేశించారు. మంచు కుటుంబంంలో గొడవలు తారాస్థాయికి చేరాయి. హైదరాబాద్ జల్ పల్లిలోని మంచు మోహన్ బాబు ఇంటి వద్ద నిన్న రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మోహన్ బాబు, మంచు మనోజ్ ఇద్దరూ ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ పోలీసులను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే మంచు ఫ్యామిలీలోని గొడవను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై మోహన్ బాబు దాడి చేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో టీవీ9 ప్రతినిధి రంజిత్ తీవ్రంగా గాయపడ్డారు. అతడి కంటికి, చెవికి మధ్య మూడు చోట్ల జైగోమాటిక్ ఎముక విరిగినట్లు వైద్యులు తెలిపారు. టీవీ9 మీడియా ప్రతినిధి రంజిత్ పై దాడి చేసిన అనంతరం అక్కడి నుంచి మోహన్ బాబు, విష్ణు వెళ్లిపోయారు. ప్రస్తుతం మంచు మనోజ్ జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటిలోనే ఉన్నారు. మోహన్ బాబు ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు మనోజ్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు.