Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత.. నవ భారత రూపశిల్పి ఇకలేరు
మాజీ ప్రధాని. కాంగ్రెస్ కురవృద్దుడు మన్మోహన్ సింగ్ ఇక లేరు. నవ భారత రూపశిల్పి 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్) ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆ వివరాలు ఇలా.. మాజీ ప్రధాని, కాంగ్రెస్ కురవృద్దుడు మన్మోహన్ సింగ్(92) గురువారం ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో తుది శ్వాస విడిచారు. వృద్దాప్య సంబంధిత కారణాలతో ఆయన్ని కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. మన్మోహన్ సింగ్ మృతికి ప్రధాని మోదీతో సహా రాజకీయ ప్రముఖులందరూ నివాళులు అర్పించారు. భారతదేశానికి 14వ ప్రధానమంత్రిగా పని చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్.. దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా గుర్తింపు పొందారు. పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు. ఆ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు అమలు చేయడంలో మన్మోహన్ సింగ్ కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ ప్రభుత్వ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన ఆ పదవిలో కొనసాగారు. మే 22, 2004న ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సింగ్.. మే 26, 2014 వరకు వరుసగా రెండు పర్యాయాలు ఆ పదవిలో బాధ్యతలు చేపట్టారు. మొత్తం 3,656 రోజుల పాటు కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్(UPA) ప్రభుత్వానికి నాయకత్వం వహించి, అత్యధిక కాలం పనిచేసిన మూడో ప్రధానిగా నిలిచారు. సెప్టెంబర్ 26, 1932న పశ్చిమ పంజాబ్‌లోని గాహ్ గ్రామంలో(ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉంది) జన్మించిన మన్మోహన్ సింగ్.. చండీగఢ్‌లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ చేశారు. అలాగే ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పొందారు. సింగ్ ప్రభుత్వ సేవలో సుదీర్ఘమైన అనుభవం కలిగి ఉన్నారు. ఇందిరా గాంధీ హయాంలో 1971లో విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖకు ఆర్థిక సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 1972లో ఆర్థిక మంత్రిత్వ శాఖలో ముఖ్య ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. 1976 వరకు ఆ పదవిలో ఉన్నారు. 1976-1980 మధ్య మన్మోహన్ సింగ్ అనేక కీలక పదవులు చేపట్టారు. వీటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డైరెక్టర్‌గా, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ బ్యాంక్ డైరెక్టర్‌గా, మనీలాలోని ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో భారతదేశానికి ప్రత్యామ్నాయ గవర్నర్, ఆల్టర్నేట్‌గా ఉన్నారు. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్(IBRD) బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌లో భారతదేశానికి గవర్నర్‌గా.. అలాగే ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శిగా.. అటామిక్ ఎనర్జీ కమిషన్, స్పేస్ కమిషన్ రెండింటిలోనూ సభ్యుడు(ఫైనాన్స్) గా కూడా పదవులు చేపట్టారు మన్మోహన్ సింగ్.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827