Kerala: డ్యాన్స్ ఈవెంట్ లో ప్రమాదం.. ఎమ్మెల్యే తలకు తీవ్ర గాయం.. వెంటిలేటర్‌పై చికిత్స..

అతిధిగా ఓ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఎత్తైన వేదిక నుంచి కింద పడింది. ఈ ప్రమాదంలో తల పగిలి తీవ్ర రక్త స్రావం అయింది. ప్రస్తుతం ఆ ఎమ్మెల్యే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతోంది. ఈ దారుణ ఘటన కేరళలో చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కలూర్ స్టేడియంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఉమా థామస్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె వెంటిలేటర్ సపోర్టుపై ఉన్నారు. ఆమె గాయం నుంచి తీవ్ర రక్త స్రావం అయినట్లు తెలుస్తోంది. కేరళలోని కలూర్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన డ్యాన్స్ ఈవెంట్‌లో వేదికపై నుంచి పడిపోవడంతో త్రిక్కకర ఎమ్మెల్యే ఉమా థామస్ తీవ్రంగా గాయపడ్డారు. దాదాపు 15 అడుగుల ఎత్తు నుంచి కిందపడటంతో ఎమ్మెల్యే తలకు, ఊపిరితిత్తులకు గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వెంటిలేటర్ సపోర్టుపై చికిత్స ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు నిర్వాహకులపై అధికారులు చర్యలు తీసుకుని కేసు నమోదు చేశారు. ఉమా థామస్ హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసిన ఆస్పత్రి సిబ్బంది సిటి స్కాన్‌లో తలలో గ్రేడ్ 2 డిఫ్యూజ్ అక్షసంబంధ గాయం (మెదడు గాయం) అయినట్లు తెలిపింది. అంతేకాదు గర్భాశయం, వెన్నెముకలో గాయాలు కూడా అయినట్లు.. పై నుంచి కిందకు పడడం వలన ముఖం, పక్కటెముకలలో పగుళ్లు ఏర్పడ్డాయని వెల్లడించింది. అంతేకాదు ఊపిరితిత్తులలో రక్తస్రావం అవుతుందని చెప్పారు. తలకు తీవ్ర గాయం అయినా సరే ప్రస్తుతం అత్యవసర శస్త్రచికిత్స అవసరం లేదని చెప్పారు. ప్రాథమిక CT స్కాన్‌లో శరీరంలోని ఎముకలలో తీవ్రమైన పగుళ్లు కనిపించలేదు. గాయాలకు స్టిచెస్ వేసినట్లు చెప్పారు. ఉమా థామస్ కండిషన్ గురించి 24 గంటల పర్యవేక్షణ తర్వాత మాత్రమే స్పష్టంగా చెప్పగమని వెల్లడించింది. వేదిక ఏర్పాటులో లోపాలున్నాయని గుర్తించిన పలరివట్టం పోలీసులు.. కార్యక్రమం నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. ప్రమాదం జరిగిన స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమ నిర్వాహకులపై, పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌పై అగ్నిమాపక దళం ప్రాథమిక నివేదికను కూడా సిద్ధం చేసింది. జిల్లా అగ్నిమాపక అధికారికి అందిన ప్రాథమిక నివేదికను ఈ రోజు అగ్నిమాపక అధికారికి అందజేయనున్నట్లు అధికారులు తెలిపారు.