Kamal Haasan: కమల్‌హాసన్‌ ఇంటి దగ్గర ముస్లిం సంఘాలు ఆందోళన.. ఎందుకంటే..

కమల్ హాసన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన ఫ్యాన్స్ సంబరాలు చేస్తుంటే.. చెన్నైలోని కమల్ హాసన్ ఇంటి దగ్గర ముస్లింలు ధర్నాకు దిగారు. కమల్‌ హాసన్‌ నిర్మించిన అమరన్‌ సినిమాపై అభ్యంతరం తెలుపుతూ ఆందోళన చేశారు. అసలు వివాదం ఏంటో చూద్దాం.. తమిళ నటుడు కమల్‌హాసన్‌ ఇంటి దగ్గర ముస్లిం సంఘాలు ఆందోళన చేపట్టాయి. ఇటీవల కమల్ నిర్మించిన అమరన్‌ మూవీలో ముస్లింలను ఉగ్రవాదులుగా చూపెట్టారని ఆరోపిస్తూ.. చెన్నైలోని కమల్ ఇంటి దగ్గర ఆందోళనకు దిగారు. అమరన్‌ సినిమాలో ఉన్న అభ్యంతరకర సన్నివేశాలను తొలగించాలని డిమాండ్ చేశారు. కమల్‌హాసన్‌ దిష్టిబొమ్మ దహనం చేయడంతోపాటు.. తక్షణమే సన్నివేశాలను తీసేయాలని నినాదాలు చేశారు. పోలీసులు ఆందోళనకారులను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించారు. శివకార్తికేయ హీరోగా సాయి పల్లవి హీరోయిన్‌గా నటించిన అమరన్‌ మూవీ ఇటీవల రిలీజ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచింది. ఓ జవాన్ నిజ జీవితం ఆధారంగా వచ్చిన ఈ అమరన్‌ సినిమాను కమల్‌ హాసన్‌ ప్రొడ్యూస్ చేశారు. అయితే అందులో ముకుంద్ వరదరాజన్ కులాన్ని ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టారని ఇటీవల వివాదాలు తలెత్తాయి. ఈ వివాదం ఇప్పుడు సద్దుమణగగా, అన్నాడీఎంకే కూటమిలో భాగమైన SDPI అమరన్ సినిమాను బ్యాన్ చేయాలని ఆందోళనకు దిగింది. దీంతో సినిమాపై మళ్లీ వివాదం చెలరేగింది. వాస్తవానికి సినిమాల్లో ప్రయోగాలకు ఎప్పుడూ తహతహలాడుతుంటాడు కమల్‌ హాసన్‌. మాస్, క్లాస్ ప్రేక్షకుల కోసం చాలా అరుదైన అంశాలను తన సినిమాకు ముడిసరుగ్గా ఎంచుకుంటాడు. ప్రయోగాల కోసం కమల్‌ నిర్మాతగా కూడా మారాడు. అయితే కమల్ హాసన్‌ నటించిన, ప్రొడ్యూస్‌ చేసిన సినిమాలపై గతంలోనూ వివాదాలు రాజుకుంటున్నాయి. విశ్వరూపం సినిమాపై కూడా కొన్ని వర్గాలను నుంచి అభ్యతరం వ్యక్తమైంది. భారతీయుడు -2 సినిమా పేరుపై కూడా రచ్చ జరిగింది. గతంలో కమల్ హాసన్ సినిమా దశావతారాలు సినిమా వివాదాలకు అప్పట్లో నిలయంగా మారింది. ఇలా కమల్‌ హాసన్‌ సినిమా రిలీజ్‌ అవ్వడం.. దానిపై ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంది.