Hyderabad: హైదరాబాద్‌ వాసులకు హైఅలర్ట్ .. రాబోయే వారం రోజుల పాటు ఎముకలు కొరికే చలి

హైదరాబాద్‌ వాసులకు హైఅలర్ట్ .. రాబోయే వారం రోజుల పాటు ఎముకలు కొరికే చలి గ్యారంటీ.. ఇప్పటికే గత రెండు మూడు రోజుల నుంచి సిటీతో పాటు నగర శివారుని కోల్డ్‌ వేవ్స్‌ కమ్మేశాయి. ఇదే వెదర్‌ మరో ఏడెనిమిది రోజుల పాటు ఉంటుందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఇటు చలి..మరోవైపు సీజనల్‌ వ్యాధులు విజృంభించే ఛాన్స్‌ ఉండటంతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌పై చలి పగబట్టింది. జంటనగరాల్లో చలి తీవ్రత పెరిగింది. నగరశివారులో గత రెండు, మూడు రోజుల నుంచి కోల్డ్‌ వేవ్స్‌ వణికిస్తున్నాయి. ఇది మరో వారం రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో ఉదయం పూట మార్నింగ్‌ వాకర్స్‌, ఇంటి నుంచి బయటకి వెళ్లే ఉద్యోగస్తులు వణికిపోతున్నారు. హైదరాబాద్‌ నగర శివారులోని ఇబ్రహీంపట్నంలో రికార్డ్‌ స్థాయిలో 11.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాజేంద్రనగర్‌లో 12.4, BHELలో 12.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే వారం రోజుల్లో చలి తీవ్ర మరింత పెరిగే ఛాన్స్‌ ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించడంతో జనం వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో నరకం చూడటం గ్యారంటీ అని బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అటు దక్షిణ తెలంగాణలో సాధారణ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్‌లో చలి పులి వణికిస్తుంది. సింగిల్ డిజిట్‌కు పడిపోయింది ఉష్ణోగ్రత. కొమురంభీం జిల్లా సిర్పూర్ యులో రికార్డ్ స్థాయిలో 9.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు అయింది. గిన్నెదరి 10.3 , తిర్యాణి‌ 10.8, కెరమెరి 12.3, వాంకిడి 12.5, ఆసిపాబాద్ 12.7 , జైనూర్ 13.7 గా ఉష్ణోగ్రత నమోదయ్యింది. మంచిర్యాల‌ జిల్లా జన్నారంలో 13.5, ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ 11.5, బేల 11.9, చాప్రాల 12.1, అర్లి టి 12.1 సెంటిగ్రేట్ ఉష్ణోగ్రత నమోదయింది.