Half Day Schools: నేటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం.. మధ్యాహ్నం నుంచి ఇంటికి!
రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ రోజు నుంచి ఒంటి పూట బడులు ప్రారంభమయ్యాయి. మధ్యహ్నం ఒంటి గంట వరకు మాత్రమే పాఠశాలలు పనిచేస్తాయి. మధ్యాహ్న భోజనం అనంతరం విధ్యార్ధులందరినీ ఇంటికి పంపిస్తారు. ఇక ఆయా పాఠశాలల్లోని టీచర్లు మాత్రం ప్రతి ఇంటికి వెళ్లి కుల గణన సర్వే చేపడతారు.. హైదరాబాద్, నవంబర్ 6: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక పాఠశాలలను (ప్రైమరీ స్కూళ్లు) బుధవారం నుంచి సగం పూటే నిర్వహించనున్నారు. ప్రైమరీ స్కూళ్లను ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకే నడుపుతారు. రాష్ట్రంలో కుల గణన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. కుల గణన బుధవారం నుంచి ప్రారంభంకానున్నది. సర్వే కోసం ప్రాథమిక పాఠశాలల్లో పనిచేసే సెండరీ గ్రేడ్ టీచర్లు, హెచ్‌ఎంల సేవలను వినియోగించుకుంటున్నారు. అందువల్ల రాష్ట్రంలోని దాదాపు 18,241 ప్రాథమిక స్కూళ్లు సగంపూట మాత్రమే తెరుచుకోనున్నాయి. మధ్యాహ్నం నుంచి పాఠ శాలలను మూడు వారాల పాటు మధ్యాహ్నం ఒంటిగంట వరకూ నడపాలని పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. మధ్యాహ్న భోజనం తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపడం జరుగుతుంది. నవంబర్ 30 వరకు ఈ సర్వే కొనసాగనుంది. ఇందులో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు 80 వేల మంది ఎన్యూమరేటర్లను ప్రభుత్వం నియమించింది. వీరిలో 36,559 టీచర్లు, 3,414 మంది ప్రాథమిక పాఠశాలల హెడ్ మాస్టర్లు ఉన్నారు. ఇక ఇతర సిబ్బందిలో కార్యదర్శులు, గ్రామస్థాయి సిబ్బంది ఉండటం విశేషం. మండలస్థాయిలో సర్వే పర్యవేక్షణకు సుమారు 8 వేల మందిని సూపర్‌వైజర్లు, నోడల్ ఆఫీసర్లుగా మరో 620 మందిని ప్రభుత్వం నియమించింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభంకానున్న కులగణన సర్వేలో మూడు రోజులపాటు హౌస్‌లిస్టింగ్ చేపడతారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ పరిధిలోని గ్రామాల పేర్లను కోడ్‌రూపంలో, వార్డు నంబర్, ఇంటి నంబర్, వీధి పేరు కూడా నమోదు చేస్తారు. ప్రభుత్వం ముద్రించిన ఫార్మాట్‌లో కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు సేకరించి నమోదు చేస్తారు. 56 ప్రధాన ప్రశ్నలు, 19 అనుబంధ ప్రశ్నలు కలిపి మొత్తం 75 ప్రశ్నల ద్వారా సమాచారం సేకరిస్తారు. ఇందులో ఆధార్, ధరణి పాస్‌బుక్, సెల్‌ఫోన్ నంబర్లు కూడా నమోదు చేసుకుంటారు. మొత్తం వివరాలు పూర్తి అయ్యాక, తాను చెప్పిన వివరాలన్నీ నిజమేనని చెబుతూ కుటుంబ యజమాని సంతకం తీసుకుంటారు. ఈ లెక్కన ఒక్కో కుటుంబం వివరాల నమోదుకు 10 నుంచి 20 నిమిషాల సమయం పట్టే అవకాశం ఉంది. ఇలా ఒక్కో ఎన్యూమరేటర్ 150 ఇండ్లను సందర్శించాల్సి ఉంటుంది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827