Delhi New CM: మరోసారి బీజేపీ బిగ్ ట్విస్ట్.. ఆఖరి క్షణంలో సీఎం రేసులో ఆ రెండు పేర్లు

ఢిల్లీ సీఎం ఎంపికలో బీజేపీ ఆశ్చర్యకరమైన నిర్ణయాన్ని తీసుకోబోతుందా?... ఎస్సీలకు బీజేపీ వ్యతిరేకమనే కాంగ్రెస్ ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు అస్త్రాన్ని సిద్ధం చేసిందా?... ఢిల్లీ సీఎం ఎంపికతో కాంగ్రెస్ ప్రచారానికి చెక్ పెట్టనుందా? బీజేపీ నిర్ణయాలను ముందే పసిగట్టడం అంత ఈజీ కాదు.. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థుల ఎంపిక మొదలు.. కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఎంపిక విషయంలో బీజేపీ ఎప్పటికప్పుడు ట్విస్టుల మీద ట్విస్ట్‌లు ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఢిల్లీ సీఎం ఎంపిక విషయంలో బీజేపీ మరో బిగ్ ట్విస్ట్ ఇవ్వనుందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఢిల్లీ సీఎంగా మహిళను ఎంపిక చేస్తారంటూ బుధవారం ఉదయం వరకు ప్రచారం జరిగింది. షాలీమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా పేరును ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిపాదించగా.. బీజేపీ అధిష్టానం ఓకే చెప్పిందనే చర్చ జరిగింది. మరో గంటలో బీజేపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుండగా.. మరికొన్ని పేర్లు ఢిల్లీ సీఎం రేసులో వినిపిస్తున్నాయి. వీరిలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఇద్దరు అభ్యర్థుల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ ఇద్దరు ఎస్సీ రిజర్వు నియోజకవర్గాల నుంచి గెలుపొందినవాళ్లే. ప్రస్తుత రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బీజేపీ ఎస్సీ సామాజిక వర్గం నుంచి సీఎంను ఎంపిక చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.