CM Revanth Reddy: అల్లు అర్జున్ ఇంటిపై దాడి.. స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కీలక ఆదేశాలు జారీ

అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఖండిస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ దాడిని ఖండించగా, తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించారు. ఈ మేరకు పోలీసు ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతల దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన ఆయన శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ‘సినీ ప్రముఖుల ఇళ్ల పై దాడి ఘటనను ఖండిస్తున్నాను. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందిగా రాష్ట్ర డీజీపీ, నగర పోలీసు కమిషనర్ ను ఆదేశిస్తున్నాను. ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్ని సహించేది లేదు. సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది స్పందించకుండా ఉన్నతాధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ట్వీట్ చేశారు రేవంత్ రెడ్డి.