BRS: బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌తో హైటెన్షన్‌.. ఖండించిన ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్

హైదరాబాద్‌లో హైటెన్షన్ నెలకొంది. గురువారం ఉదయం కౌశిక్‌రెడ్డితో మొదలైన అరెస్టులు రాత్రి కూడా కొనసాగాయి. హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి సహా గులాబీ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. బుధవారం బంజారాహిల్స్‌ పోలీసుల విధులకు ఆటంకం కలిగించారన్న కేసులో గురువారం బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వాధికారి విధులకు ఆటంకం కలిగించడం.. ఉద్దేశపూర్వకంగా నిర్బంధించేందుకు యత్నించాడంటూ పోలీసులు కౌశిక్‌రెడ్డిపై కేసులు నమోదు చేశారు. కౌశిక్‌ రెడ్డి అరెస్టు సందర్భంగా ఆయన ఇంటిదగ్గర హైడ్రామా నెలకొంది. పోలీసులు బెడ్‌రూమ్‌లోకి వెళ్లి కౌశిక్‌ను అరెస్ట్ చేశారంటూ బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. దీంతో హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నేతలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. కౌశిక్‌రెడ్డిని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు, హరీశ్‌రావును గచ్చిబౌలి పీఎస్‌కు తరలించారు పోలీసులు. ముందు జాగ్రత్తగా హరీశ్‌రావును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు పోలీసులు. కౌశిక్‌రెడ్డి భార్య షాలిని పోలీసులకు మెడికల్ రిపోర్ట్‌లు సమర్పించారు. మెడిసిన్స్‌ ఇచ్చేందుకు అనుమతివ్వాలని పోలీసులను కోరారు. ఉదయం నుంచి బంజారాహిల్స్‌ పీఎస్‌ దగ్గరే ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఎర్రబెల్లి, తలసాని, వివేకానంద, సబిత, ఎమ్మెల్సీ కవిత కౌశిక్‌రెడ్డిని పరామర్శించారు. హరీశ్‌రావును గచ్చిబౌలి పీఎస్‌కు తరలించడంతో బీఆర్ఎస్ నేతలు అక్కడికి క్యూ కట్టారు. నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కవిత హరీశ్‌రావును పరామర్శించారు. విడతల వారీగా వెళ్లి పీఎస్‌ ముందు ధర్నాకు దిగారు. హరీశ్‌రావును విడదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఒంటేరు ప్రతాప్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నార్సింగ్ పీఎస్‌కు తరలించారు. రాత్రి 8 గంటలకు హరీశ్‌రావును విడుదల చేశారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన కౌశిక్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు ఎమ్మెల్సీ కవిత. మాజీమంత్రులను, ఎమ్మెల్యేలను అన్యాయంగా అదుపులోకి తీసుకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత. బీఆర్ఎస్ నేతల అరెస్ట్‌ను ఖండించారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అరెస్టులకు భయపడేదిలేదన్నారాయన. మరోవైపు అరెస్టులకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా గులాబీ నేతలు ఆందోళనకు దిగారు.