Bangladesh: బంగ్లాదేశ్‌లో హిందూ సంస్థలపై ఉక్కుపాదం.. ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ ప్రభు అరెస్ట్‌..

బంగ్లాదేశ్‌లో హిందూ సంస్థలపై ఉక్కుపాదం మోపడం సంచలనం రేపుతోంది. ఇస్కాన్‌ గురువు చిన్మయ్‌ప్రభును దేశద్రోహం కేసు కింద బంగ్లా ప్రభుత్వం అరెస్ట్‌ చేసింది. దీంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. అక్టోబర్ 30న చిన్మయ్ దాస్ సహా 19 మందిపై చిట్టగాంగ్‌లోని కొత్వాలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. హిందూ సమాజం చేపట్టిన ర్యాలీలో బంగ్లాదేశ్ జాతీయ జెండాను అవమానించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. చిన్మోయ్ కృష్ణ దాస్‌ను వెంటనే విడుదల చేయాలని ఇస్కాన్ సంస్థ బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. అదే సమయంలో ప్రధాని మోడీకి చిన్మయ్‌ప్రభును విడుదల చేసేలా చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఇస్కాన్ నాయకులలో ఒకరైన చిన్మోయ్ కృష్ణ దాస్‌ను ఢాకా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై ఇస్కాన్ సంస్థ స్పందిస్తూ.. చిన్మయ్ దాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తమకు ఆందోళన కలిగించే వార్తలు వచ్చాయని తెలిపింది. బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే చిన్మోయ్ కృష్ణ దాస్‌ను విడుదల చేయాలని విజ్ఞప్తి చేసింది. భక్తుల భద్రత కోసం శ్రీకృష్ణుడిని ప్రార్థిస్తున్నామని పేర్కొంది. “ప్రపంచంలో ఏ ఉగ్రవాదంతో ఇస్కాన్‌కు సంబంధం లేదని.. నిరాధారమైన ఆరోపణలు చేయడం దారుణం” అని ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ప్రధాని మోడీ తక్షణమే స్పందించాలని.. ఈ ఘటనపై తగిన చర్య తీసుకోవాలని, బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మాట్లాడాలని ఇస్కాన్ సంస్థ భారత ప్రభుత్వాన్ని కోరింది. ఇస్కాన్ సంస్థ శాంతియుత భక్తి ఉద్యమాన్ని మాత్రమే నడుతున్నట్లు భారత ప్రభుత్వం బంగ్లాదేశ్‌కు చెప్పాలని కోరింది.