AP – Telangana: తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు.. ఏపీ సర్కార్ ఏం చేయబోతుంది..?

పుష్ప ఎఫెక్ట్‌తో టాలీవుడ్‌కు షాక్‌ ఇచ్చారు.. సీఎం రేవంత్‌రెడ్డి. ఇకపై టికెట్‌ ధరల పెంపు, బెనిఫిట్‌ షోలు ఉండవని తేల్చిచెప్పారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. తెలంగాణ సర్కారు నిర్ణయం.. సంక్రాంతి బరిలో ఉన్న బడా బడ్జెట్‌ సినిమాలను టెన్షన్ పెడుతోంది. భారీ కలెక్షన్స్‌ను టార్గెట్‌ చేసిన ఆ మూవీస్ పరిస్థితి ఏంటి..? రికార్డులపై ఆ సినిమాలు ఆశలు వదులుకోవాల్సిందేనా..? తెలంగాణ సరే ఏపీలో చంద్రబాబు సర్కారు ఏం చేయబోతోంది..? తెలంగాణలో బెనిఫిట్ షోలు, టికెట్ ధరల పెంపును రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి చేసిన కామెంట్స్‌..సంక్రాంతి సీజన్‌ను టార్గెట్‌ చేసిన బడా మూవీస్‌కు షాక్‌ ఇచ్చాయి. సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌పై సీరియస్‌ అయిన ముఖ్యమంత్రి.. ఇక నుంచి తెలంగాణ‌లో బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపునకు అనుమ‌తి ఇచ్చేది లేద‌ని అసెంబ్లీలో స్పష్టం చేశారు. సినిమాలు చేసుకోండి, డబ్బులు సంపాదించుకోండి కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు. సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని, బెనిఫిట్ షోలను అనుమతించబోమని ప్రకటించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అభినందించారు.. సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఇదే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నారాయణ సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా టిక్కెట్ రేట్ల పెంపును ఖండించిన నారాయణ.. సందేశాత్మక చిత్రాలకు మాత్రమే ప్రభుత్వాలు రాయితీలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇక మీదట పెద్ద సినిమాల టికెట్ రేట్లు పెంచబోమన్న సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతించారు తెలంగాణ సింగిల్ స్క్రీన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజేందర్ రెడ్డి.