AP Rains: వానలు బాబోయ్ వానలు.! తరుముకొస్తున్న తుఫాన్.. ఈ ప్రాంతాలకు భారీ రెయిన్ అలెర్ట్

ఫెంగల్‌ తుఫాను భయం ఏపీని వణికిస్తోంది.. ఉరిమి ఉరిమి ముంచుకొస్తున్న తుపాను ఇవాళ తీవ్ర వాయుగుండంగా మారనుంది. ఈ తుఫాన్ మరో రెండు రోజుల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండం నుంచి బలపడి అది కాస్తా తుఫానుగా మారనుంది. మరికొద్ది గంటల్లో తుఫాన్‌గా మారనున్న తీవ్ర వాయుగుండం ప్రభావంతో మూడు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సమీపంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారి బలహీనపడుతుందని ముందుగా వాతావరణ శాఖ అంచనాలు వేసింది. కానీ అది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. ఇవాళ తుఫానుగా మారనుంది. తుఫాన్‌కు ఫెంగల్ తుఫాన్‌గా నామకరణం చేశారు. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రవాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు తీరం వైపు దూసుకు వస్తోంది. గంటకు 12 కిలోమీటర్ల వేగంతో ముందుకు కదులుతున్న తుఫాన్ ప్రభావం మూడు రోజులు పాటు ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రస్తుతానికి అది కదులుతున్న మార్గాన్ని బట్టి పుదుచ్చేరి చెన్నై మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఆ తర్వాత తుఫాన్ బలహీనపడి తీరం దాటినా మరొక మూడు రోజులపాటు దారి నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.