AP Politics: అలా అయితేనే వైసీపీకి ఏపీలో పూర్వవైభవం.. జగనే మారాలట..!
ఏపీలో వైసీపీ బలోపేతానికి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టారు. ఈ దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అయితే రాష్ట్రంలో వైసీపీ పూర్వ వైభవం సాధించాలంటే జగన్ వ్యవహార శైలిలో ఇంకా మార్పురావాలని సొంత పార్టీకి చెందిన కొందరు నేతలు సూచిస్తున్నారు. ఇంతకీ జగన్ వ్యవహార తీరుపై వారి అసంతృప్తికి కారణమేంటో ఇప్పుడు చూద్దాం.. ఏపీలో వైసీపీ పూర్వవైభవం సాధించాలంటే ఏం చేయాలి? దీని కోసం పార్టీ అధినేత జగన్ చేయాల్సిందేంటి? వైసీపీ శ్రేణుల్లో ఇప్పుడు ఇదే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఏపీలో ఎన్నికల ఫలితాలు వైసీపీ శ్రేణులను తీవ్ర నిరుత్సాహానికి గురిచేశాయి. ఎన్నికల ఫలితాల తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇప్పటికే పార్టీకి బలంగా భావించిన పలువురు ఎమ్మెల్సీలు,రాజ్యసభ సభ్యులు ఒక్కొక్కరు వైసీపీని వీడారు. మరికొందరు వీడుతున్నారు. పోతూపోతూ జగన్ వైఖరే తాము పార్టీని వీడేందుకు కారణమంటూ నిందిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో పార్టీ భవిష్యత్ ఏంటని వైసీపీ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో ఓటమితో ఢీలాపడ్డ వైసీపీ శ్రేణుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు జగన్ పెద్ద కసరత్తును ఇప్పటికే ప్రారంభించారు. పార్టీలో పెద్ద ఎత్తున ప్రక్షాళన చేపట్టారు. కేంద్ర కార్యాలయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లా కార్యాలయాల వరకు నాయకత్వం మార్పు చేపట్టారు. జిల్లా అధ్యక్షులు నుంచి నియోజకవర్గ ఇంఛార్జ్‌ల వరకు అవసరం అనుకున్న ప్రతి చోటా కొత్త వారిని నియమించారు. చివరకు పార్టీ అనుబంధ విభాగాలకు సైతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియామకం చేపట్టారు. వైసిపి భవిష్యత్తుపై కొత్త ఆశలు చిగురించాయని భావిస్తున్న వేళ.. తాజాగా పార్టీ అధినేత జగన్ వైఖరిపై లోలోపల ఆ పార్టీకి చెందిన కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో జగన్ ఇంకా మారాలని సూచిస్తున్నారు. జగన్ మారితే తప్ప పార్టీ పరిస్థితి మారదని చెబుతున్నారు. రాష్ట్రంలో సొంత పార్టీ నేతలపై వరుస కేసులు, అరెస్టులతో పాటు పార్టీ నేతలపై వేధింపులు, దాడులపై కార్యాచరణ సిద్ధం చేయాల్సిన బాధ్యత పార్టీ అధినేత జగన్‌పై లేదా అని ప్రశ్నిస్తున్నారు. కేవలం ప్రకటనలు, సమావేశాలకు పరిమితం కాకుండా.. బాధితులకు అండగా నిలిచేలా ప్రత్యక్ష పర్యటనతో భరోసా ఇవ్వాలని సూచిస్తున్నారు. అలాగే పార్టీ తరపున పిలుపునిచ్చిన ఆందోళన కార్యక్రమాలకు స్వయంగా జగనే దూరంగా ఉంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల రైతులు, వ్యవసాయ సమస్యలు, విద్యుత్ ఛార్జీల భారానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా వైసీపీ చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి.. ఆ పార్టీ నేతలందరూ కదిలి వచ్చారు. అయితే పార్టీ అధినేత జగన్ ఎక్కడా కనిపించలేదు. తాడేపల్లి లేదా బెంగుళూరు అన్నట్లు ఉంటే రాష్ట్ర ప్రజలకు పార్టీ పట్ల ఎలా నమ్మకం కలుగుతుందని జగన్‌ను సొంత పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏపిలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై పెద్ద ఎత్తున ఆందోళనలకు పిలుపునిచ్చి పార్టీ కార్యక్రమాల్లో అధినేత పాల్గొనకపోవడం సరికాదని పెదవి విరుస్తున్నారు. ఇలా అయితే ప్రజలోక్కి తప్పుడు సంకేతాలు వెళతాయని.. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో జగన్ స్వయంగా పాల్గొనాలని సూచిస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాల్లో ఏదో ఒక జిల్లాలో ఆయన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తుచేస్తున్నారు. బాధుడే బాదుడు అంటూ చంద్రబాబు చేసిన వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక నినాదం రాష్ట్ర ప్రజల్లో బలంగా గుర్తు ఉండిపోయిందని వైసీపీ శ్రేణులు గుర్తుచేస్తున్నారు. అయితే మరికొందరు వైసీపీ నేతలు మాత్రం పార్టీ అధినేత జగన్ పార్టీ పిలుపునిచ్చే అధికార కార్యక్రమాలకు జగన్ దూరంగా ఉండటాన్ని సమర్థిస్తున్నారు. ఎప్పుడు ప్రజల్లోకి రావాలన్న విషయంలో ఆయన క్లారిటీకి ఉందని చెబుతున్నారు. సంక్రాంతి తర్వాత జగన్ ప్రజల్లోకి వెళ్లి పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతారని ధీమా వ్యక్తంచేస్తున్నారు.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827