Andhra Pradesh: మరో నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య ఆధిపత్య పోరు.. తెలుగు తమ్ముళ్ల సంచలన నిర్ణయం..!
నెల్లిమర్ల నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య తలెత్తిన ఆధిపత్య పోరు రాష్ట్ర రాజకీయాల్లో కీలక చర్చనీయాంశంగా మారింది. జనసేన ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తీరుతో టీడీపీ నాయకులు అసంతృప్తి చెందుతున్నారు. టీడీపీ నాయకులకు ఎమ్మెల్యేను కలవడం కష్టంగా మారడంతో నాలుగు మండలాల నాయకులు ఆమెకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం పార్టీ అధిష్టానాల దృష్టికి వెళ్ళడంతో సమన్వయ కమిటీ జోక్యం చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడక్కడా టీడీపీ, జనసేన నేతల మధ్య ఆధిపత్య పోరు తెరపైకి వస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా… మరో నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్లు, జనసేన కార్యకర్తల మధ్య రాజకీయ రగడ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో టిడిపి, జనసేన మధ్య గ్రూప్ పాలిటిక్స్ తారాస్థాయికి చేరాయి. నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. టీడీపీ ఆవిర్భావం నుంచి ఇప్పటివరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ తొమ్మిది సార్లు పోటి చేస్తే ఏడుసార్లు గెలుపొందింది.. టీడీపీ నేత మాజీ మంత్రి పతివాడ నారాయణ స్వామి నాయుడు వరుసగా గెలుపొందారు. అంతటి కంచుకోట నెల్లిమర్లను పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించక తప్పలేదు. అలా, 2024 ఎన్నికల్లో లోకం నాగ మాధవి ఎన్నికల బరిలోకి దిగితే సుమారు 40 వేల వేల మెజారిటీతో వైసిపిపై విజయం సాధించారు. ఇంతటి గెలుపులో టీడీపీ ఎంతో కష్టపడిందనేది సుస్పష్టం. అంతవరకు బాగానే ఉన్నా ఆ తర్వాత నుండి లోకం నాగ మాధవి తీరు టీడీపీకి ఇబ్బందికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ఉన్న నెల్లిమర్ల, డెంకాడ, పూసపటిరేగ, భోగాపురం టీడీపీ మండల స్థాయి నాయకులకు ఎమ్మెల్యేని కలవాలంటేనే చుక్కలు కనిపిస్తున్నాయి. కార్పొరేట్ వ్యాపారవేత్త అయిన నాగమాధవి ప్రజా జీవితంలోకి వచ్చిన తరువాత కూడా ఆమె వ్యవహారశైలి కార్పొరేట్ వ్యవస్థనే తలపిస్తుందనే టాక్ వినిపిస్తుంది. ఎమ్మెల్యేగా కలిసి తమ బాధలు చెప్పుకోవాలంటే టీడీపీ నాయకులకు రోజుల సమయం పడుతుంది. పోనీ ఏదోలా కలుద్దామంటే పార్టీ సీనియర్లు అయినా గేటు బయటే గంటల కొద్దీ కూర్చోవాల్సిందే. ఇక్కడ టీడీపీ ఇన్చార్జ్, మార్క్ ఫెడ్ చైర్మన్ అయిన కర్రోతు బంగారు రాజు కలవడానికి ప్రయత్నిస్తే సుమారు నాలుగు రోజుల తర్వాత కానీ అపాయింట్మెంట్ దొరకడంలేదట. ఎవరైనా ముందు అపాయింట్మెంట్ లేకుండా ఇంటి వద్దకు వెళ్తే నో అపాయింట్మెంట్.. టీడీపీ అంటే దూరం పెడుతున్నారని బహిరంగంగా పేర్కొంటున్నారు. ఇక టీడీపీ నాయకులు ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తే వారికి పనులు చేయొద్దని ఆదేశాలు కూడా ఇచ్చారని పేర్కొంటున్నారు.. అంతేకాకుండా తమ పార్టీ నుంచి ఏ గ్రామం నుంచి ఎవరు వస్తారో, ఎవరికి పనులు చేయాలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో ఒక లిస్ట్ ఇచ్చారట… అలా ఇక్కడ జనసేన ఎమ్మెల్యే తీరుతో తెలుగుదేశం క్యాడర్ కి కంటి మీద కునుకు ఉండటం లేదు.. ఇదే పరిస్థితిపై ఇటీవల నాలుగు మండలాల టీడీపీ నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సమావేశమై ఎమ్మెల్యేకు సహకరించొద్దని నిర్ణయించుకున్నారు. ఇదే విషయం ఇరు పార్టీల అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఫోర్ మెన్ కమిటీ జనసేన ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి కర్రోతు తో సమావేశమయ్యింది. పరిస్థితులు మార్చుకోవాలని, మిత్రపక్షాల కూటమికి నాయకుల ప్రవర్తన ఇబ్బంది కాకూడదని హితవు పలికింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ తో నియోజకవర్గ పరిస్థితులు తెలియజేసిన తరువాత మరోసారి సమావేశామవ్వాలని జనసేన ఎమ్మెల్యే మాధవికి సూచించి పంపించారు. ఇదే వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీసింది.


Contact Us
8885789259 marnebalanarasimhulu@prajaatvtelugu.com www.prajaatvtelugu.com




Dr. Marne Bala Narasimhulu
FOUNDER / CHAIRMAN
Reg No: CIN U63910AP2024PTC116827